ఒక్క ఏడాది ఆగండి.. మళ్లీ కేసీఆరే సీఎం: కేటీఆర్

ఒక్క ఏడాది ఆగండి.. మళ్లీ కేసీఆరే సీఎం: కేటీఆర్

ఆదిలాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డికి చిత్తశుద్ధి, రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే కరువు కాలంలో ఎగొట్టిన రైతుబంధు ఎకరానికి రూ.60 వేలు చెల్లించాలని, ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున రూ.36 వేలు వారి ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​డిమాండ్​చేశారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఏర్పాటు చేసి రైతు గర్జన సభలో ఆయన మాట్లాడారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ లో  ఇచ్చిన 34 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, నీళ్లు, పరిశ్రమలు, పవర్ హాలిడే, క్రాప్ హాలిడే అంటూ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ఇప్పుడు తెలంగాణాలో అన్ని బంద్ లే కనిపిస్తున్నాయని, ఆఖరికి పంట సాగు కూడా బంద్ చేశారని ఎద్దేవా చేశారు. ‘మోసపోతే గోసపడుతారు’ అని అప్పుడే కేసీఆర్​చెప్పారని, ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. 

వ్యవసాయం నిషేధమని, జరిమానా వేస్తామని, సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారని మండిపడ్డారు. రుణమాఫీకి ఎన్నో కొర్రీలు పెట్టారన్నారని, మొదట రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే రూ.50 వేల కోట్లు అవుతాయని, చివరకు రూ.26 వేల కోట్లకు మాత్రమే వేశామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. అటు రైతు బీమా, రైతుబంధు లేక.. ఇటు నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులు గురిచేస్తోందని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 108 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.  

నీళ్లన్నీ వృథాగా వదిలేస్తుండ్రు.. 

ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన తెలంగాణలోని బంగారు భూముల్లో  కరువు ఎందుకు వచ్చిందని కేటీఆర్​ప్రశ్నించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి జలాలు కిందికి వదిలి ఏడారిగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో 750 టీఎంసీలను సముద్రంలోకి వృథాగా వదిలిపెట్టారన్నారు. నాలుగు నెలల ముందే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించి నీళ్లను వాడుకోవాలని ప్రభుత్వానికి తాము సూచించినప్పటికీ పట్టించుకోలేదని చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌజ్ నీళ్లు ఎత్తిపోస్తే ఈ కరువు వచ్చేది కాదన్నారు.
 
వానకాలంలో అటు శ్రీశైలంలో, ఇటు కన్నెపల్లి ప్రారంభించకపోవడంతో 35 లక్షల ఎకరాల పంటలకు నష్టం జరిగిందన్నారు. 730 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంలో చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తుంటే, రేవంత్ రెడ్డి పక్కనే ఉన్న పాలమూరుకు 12 టీఎంసీల నీళ్లు ఎత్తలేకుండాపోయారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో చనాకా కోరటా ప్రాజెక్టు బీఆర్ఎస్ హయంలో ట్రయల్ రన్ పూర్తయితే కాంగ్రెస్ కనీసం కాలువల నిర్మాణం కూడా చేపట్టడం లేదన్నారు. సభలో మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి, సంజయ్, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.